అమెరికా అంటే భూతల స్వర్గం. ఆ దేశ కరెన్సీ 'డాలర్' చేతిలో ఉంటే ప్రపంచంలో ఎక్కడైనా ధీమాగా తిరగొచ్చు. నిశ్చింతగా ఉండొచ్చు. 30 , 40 ఏళ్ళపాటు ప్రపంచాన్ని అమెరికా శాసించిన తీరుకు అద్దం పట్టే వ్యాఖ్యలివి. ఇప్పుడు దిర్బేధ్యమనుకున్న అమెరికా కోటకు బీటలు వారుతున్నాయి. జార్జి బుష్ హయంలోనే అమెరికా పతనం మొదలైంది. బుష్... ఆసియాలో యుద్ధాలకు దిగి... ట్యాక్స్ రేట్లు తగ్గించడం వల్ల ఖర్చులు పెరిగిపోయాయి. బడ్జెట్ లోటు ఎక్కువైంది. ఆ మేరకు ఆదాయం పెరగలేదు. ఫలితంగా 2007 లో భయంకరమైన ఆర్ధిక సంక్షోభం అమెరికాను చుట్టుముట్టింది. బరాక్ హుస్సేన్ ఒబామా వచ్చేనాటికి పరిస్థితి ఏమాత్రం బాగాలేదు. గడ్డుకాలం నుండి గట్టెక్కిస్తాడనుకున్న అమెరికన్ల ఆశలు అడియాసలవుతున్నాయి.
ఒబామా అధ్యక్ష పీఠం చేపట్టినప్పటి నుంచి చోటు చేసుకున్న నాలుగు ప్రధాన ఘట్టాలు :
1 ) గల్ఫ్ ఆఫ్ మెక్సికోలో చమురు భారీ ఎత్తున సముద్రం పాలైంది. అక్కడి పర్యావరణానికి తీవ్ర నష్టం వాటిల్లింది. నష్ట నివారణలో ఒబామా సమర్ధంగా వ్యవహరించలేకపోయారు.
2 ) అమెరికా ఆరోగ్య రంగంలో ఒబామా చేపట్టిన సంస్కరణలు పెనుమార్పులు తీసుకొస్తాయని, భారీ సంఖ్యలో ఉద్యోగాలు వస్తాయని అంచనా వేశారు. కానీ అవి ఏవీ నిజం కాలేదు.
3 ) మూడో అతిపెద్ద ఘట్టం ఏమిటంటే ఒసామాబిన్ లాడెన్ ను మట్టుబెట్టడం, ఈ ఒక్క కారణంతో ఒబామా పోగొట్టుకున్న కీర్తిని కొంతమేరకు తిరిగి పొందారు.
4 ) నాలుగో అతిపెద్ద ఘటన రుణ పరిమితి పెంపు. AAA రేటింగ్ కోల్పోవడం వలన అమెరికా రుణాలమీద చెల్లించాల్సిన వడ్డీ పెరుగుతుంది. దీనివల్ల అమెరికా ఆర్ధిక వృద్ది రేటు తిరోగమనంలోకి వెళ్ళే అవకాశముంది. అంటే 2007 నాటి ఆర్ధిక మాంద్యం మరోసారి అమెరికాను చుట్టుముట్ట వచ్చన్నది విశ్లేషకుల అంచనా. అమెరికా తిరోగమనానికి స్పష్టమైన సంకేతం ఆ దేశపు రేటింగ్. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అమెరికా రేటింగ్ డౌన్ గ్రేడ్ అయ్యింది. రేటింగ్ తగ్గి పోవడంతో ఆ దేశ ఆర్ధిక వ్యవస్థ పెనం మీది నుంచి పొయ్యిలోకి పడ్డట్లయింది.
AAA రేటింగ్ ప్రపంచంలోని అత్యుత్తమ రేటింగ్. ఈ రేటింగ్ కోసం దేశాలు, కంపెనీలు కలవరిస్తాయి. AAA రేటింగ్ ఉన్న దేశాలు భద్రతకు మారుపేరుగా ఉంటాయి. వీటికి అప్పు ఇచ్చేందుకు ఏ దేశమూ, ఏ సంస్థా వెనుకాడదు. ప్రపంచంలో కేవలం 20 దేశాలకు మాత్రమే ఈ టాప్ రేటింగ్ ఉంది. అమెరికా ఇప్పుడు ఆ రేటింగ్ ను కోల్పోయింది.
ప్రపంచానికి పెద్దన్నగా పేరు తెచ్చుకున్న అమెరికా రేటింగ్ తగ్గితే ఆ ప్రభావం ప్రపంచంలోని అన్ని దేశాల మీదా ఉంటుంది. అమెరికా నుండి ఇతర దేశాలకు బిజినెస్ తగ్గిపోతుంది. ఇండియన్ ఐటి కంపెనీలకు కూడా ఆదాయం తగ్గే అవకాశం ఉంది.
టైటానిక్ నౌక మెల్లగా సముద్రంలో మునుగుతున్నట్లుగా ఉంది అమెరికా ప్రస్తుత పరిస్థితి. స్థూల జాతీయోత్పత్తిలో అమెరికా అప్పులు 99 శాతానికి చేరుకున్నాయి. అమెరికా గడ్డు పరిస్థితికి ఈ గణాంకాలే నిదర్శనం.
- హంసిని
0 comments:
Post a Comment