Breaking News
Loading...
Monday, 3 October 2011

Info Post
మణి కలం నుండి
ధారావాహికం - 9 వ భాగం
----------------------------------------------------------------------
ప్రాచీన క్షాత్ర పరంపర కలిగిన మన భారతీయ సమాజం నిన్న మొన్న కళ్ళు తెరిచిన విదేశీ జాతుల చేతులలో వోడి, వారికి తల వంచి వారి పరిపాలనకు లోబడవలసిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఎలా వచ్చింది? తెలుసుకుందాం? చదవండి ! మన చరిత్రను తెలుసుకుందాం ! ధారావాహిక ప్రతి నెల.
----------------------------------------------------------------------

విద్యారణ్యస్వామి - విజయనగర సామ్రాజ్యం

తెనుగు సీమను పదిహేను శతాబ్దాల పాటు శాతవాహనులు, ఇక్ష్వాకులు, బృహత్పలాయనులు, ఆనంద గోత్రికులు, విష్ణు కుండినులు, తూర్పు చాళుక్యులు, కాకతీయులు మహా వైభవంతో పరిపాలించారు. అమీర్ ఖుస్రూ, మార్కో పోలో వంటి వారి వ్రాతలు ఆనాటి ఆంధ్ర దేశపు సిరిసంపదలను, వైభవాన్ని వర్ణిస్తున్నాయి. కాకతీయ సామ్రాజ్యపు పతనంతో ఆంధ్ర వైభవం నేలకూలింది. అప్పుడు ఆంధ్ర దేశమే కాక దక్షిణ భారత దేశంలోని హిందూ రాజ్యాలన్నీ ముస్లిం సైన్యాల దాడుల్లో పతనమై పోయాయి. ఈ ఉత్పాతాన్ని ఎదుర్కొని దక్షిణ దేశమంతటినీ విముక్తం చేసి హిందూ ధర్మాన్ని రక్షించి పునరుద్ధరించిన ఖ్యాతి తెలుగు వాడిది. ఆంధ్ర బ్రాహ్మణ కుటుంబం లో జన్మించిన విద్యారణ్య స్వామి తపోబలంతో, సహకారంతో హంపి విజయనగరం స్థాపించబడింది. ఆ సామ్రాజ్యాన్ని స్థాపించిన హరిహర రాయలు, బుక్కరాయలు తెలుగు వారు. కాకతీయ ప్రతాప రుద్రుని ఆస్థానంలో పనిచేసిన వారు.

తెలుగు యోధులు

తెలుగు గడ్డను ముస్లిం ఆక్రమణ నుంచి, దౌర్జన్యాల నుంచి విముక్తి చేసి తెలుగు రాజ్యాలను స్థాపించిన ముసునూరి సోదరులు (ఓరుగల్లు రాజ్యం), ప్రోలయ వేమారెడ్డి (అద్దంకి రెడ్డి రాజ్యం), రేచెర్ల సింగమనీడు (ఆమనగల్లు వెలమ రాజ్యం) - వీరందరూ ఎల్లకాలం ఆరాధించుకో దగిన తెలుగు యోధులు, ఆదర్శ వీరులు.

అంతఃకలహాలు - తెలుగు వైభవ పతనం

ఈ తెలుగు రాజులు పరస్పర స్నేహంతో తమ తమ రాజ్యాలను పాలించుకొని ఉంటే తెలుగు వైభవం మరొక్క వెలుగు వెలిగేది. కాని త్వరలోనే ఈ రాజ్యాల మధ్య అంతఃకలహాలు మొదలయ్యాయి. వీటిని ఆసరాగా చేసుకొని గుల్బర్గా సుల్తాను హసన్ గంగూ బహమనీ ఓరుగల్లు రాజ్యంపై దండెత్తి కృష్ణా నది వరకు గల ప్రాంతాన్ని ఆక్రమించుకున్నాడు. ఈసారి ముసునూరి కాపయ నాయకుడికి ఇతర హిందూ రాజులు సాయం రాలేదు. చేసేది లేక అతడు ఆక్రమిత ప్రాంతాలను, గొల్లకొండ అనే సైనిక స్థావరాన్ని బహమనీ సుల్తానుకు సమర్పించుకుని సంధి చేసుకున్నాడు. ఆ గొల్లకొండ గ్రామమే ఆ తరువాత గోల్కొండగా, హైదరాబాదుగా వృద్ధి చెందింది. వెలమ రాజులు, రెడ్డిరాజులు ఒక శతాబ్దం పాటు నిరంతరమూ అంతర్యుద్ధాలు సాగించి ఒకరినొకరు నాశనం చేసుకున్నారు. క్రీ.శ. 1470 నాటికీ దేవరకొండ, రాచకొండ వెలమ రాజ్యాలు బహమనీ సుల్తాను వశమయ్యాయి. ఒరిస్సా గజపతులు క్రీ.శ. 1455 లో కొండవీడును, క్రీ.శ. 1460 లో ఓరుగల్లును స్వాధీనం చేసుకున్నారు. తెలుగు వారి వైభవం మళ్ళీ తలెత్తలేదు.

పరాయి పాలనలో తెలుగు నేల

క్రీ.శ. 1518 లో బహమనీ ముస్లిం రాజ్యం అయిదు ముక్కలుగా విడిపోయి అహమద్ నగర్, బీజాపూర్, బీదర్, బీరార్, గోల్కొండ అనే రాజ్యాలు ఏర్పడ్డాయి. అంతకుముందే విజయనగర చక్రవర్తి కృష్ణ దేవరాయలు ఒరిస్సా రాజధాని కటకం వరకు దిగ్విజయ యాత్ర చేసి వెనక్కు వెళ్ళాడు. అతని దెబ్బతో తెలుగు ప్రాంతాలపై గజపతుల పట్టు బలహీనపడింది. ఇలా ఆంధ్ర దేశంలో ఏర్పడిన రాజకీయ శూన్యం గోల్కొండ సుల్తాన్ కుతుబుల్ ముల్కుకు ఉపయోగపడింది. అతడు క్రమంగా కొండపల్లి, రాజమహేంద్రి, దేవరకొండ, నల్గొండ, కొండవీడు, కంబం మెట్టు, ఉత్తరాంధ్ర ప్రాంతాలను జయిస్తూ క్రీ.శ. 1543 నాటికి తెలుగునాడు మొత్తాన్ని తన అధీనంలోకి తెచ్చుకున్నాడు. క్రీ.శ. 1336 లో కాకతీయ సేనానులు ఏ ముప్పు నుంచి ఆంధ్ర దేశానికి విముక్తి కలిగించారో, వారి మధ్య అంతఃకలహాల కారణంగా చివరికి మళ్ళీ అదే ముప్పు తెలుగు వారి నెత్తి పైకి ఎక్కి కూర్చుంది. నాలుగు శతాబ్దాల పాటు పరాయి పాలన తెలుగు జాతిపై తాండవించింది. ఈ కాలంలో చివరి 160 సంవత్సరాలు (క్రీ.శ. 1788 - 1948 ) తెలుగు నేలలో కొంత భాగం నవాబు పాలనలోను, కొంతభాగం ఇంగ్లీషు వారి పాలనలోను ఉంది. తెలుగు వారందరూ దాసులే అయినా ఆ ప్రాంతం వారికి, ఈ ప్రాంతం వారికి యజమానులు వేరన్నమాట. నవాబు పాలనలోని ప్రాంతంలో విద్య, ఆర్ధికాభివృద్ధి కుంటుబడింది. అల్పసంఖ్యాకులైన మహమ్మదీయులు ఆధిక్యతతో వ్యవహరిస్తూ హిందువులను హీనంగా చూసేవారు. ఉర్దూ, ఫారసీ భాషలు ఆదరించబడి తెలుగు భాష, తెనుగు దనం అణగ ద్రొక్కబడ్డాయి. ఈ కారణంగా రెండు ప్రాంతాల మధ్య అభివృద్దిలో హెచ్చు తగ్గులు, ఆర్ధికంగా అసమానతలు చోటు చేసుకున్నాయి. ఈ ప్రాంతీయ అసమానతలకు మూల కారణం ఆనాటి కాకతీయ సేనానుల మధ్య అంతఃకలహాలు, వారి స్వార్ధాలు. ఉన్నత స్థానాలలో ఉన్నవారు తగు రీతిలో వ్యవహరించకపోతే అటువంటి వ్యక్తుల పాపాలకు జాతులు బలి అవుతాయి.

డిల్లీలో నిష్ఫలమైన రాజపుత్ర శౌర్యం

డిల్లీ రాజ్యాన్ని బానిస వంశపు సుల్తానులు, ఆ తరువాత ఖిల్జీ, సయ్యద్, లోడీ వంశాల సుల్తానులు మూడు శతాబ్దాలకు పైగా పాలించారు. రాణా సంగ్రామ సింహుడి (సంగ రాణా) కాలంలో చిత్తూరు రాజపుత్ర రాజ్యం బలపడి డిల్లీ రాజ్యాన్ని డీకొనే స్థాయికి వచ్చింది. ఇంతలో ఆఫ్గనిస్తాన్ పాలకుడైన బాబర్ క్రీ.శ. 1526 లో డిల్లీపై దండెత్తి మొదటి పానిపట్టు యుద్ధంలో డిల్లీ సుల్తాను ఇబ్రహీం లోడీని ఓడించి డిల్లీలో మొగల్ వంశపు పాలనను స్థాపించాడు. డిల్లీ సింహాసనాన్ని ఆశిస్తున్న సంగ రాణాకు, బాబారుకు క్రీ.శ. 1527 లో కాణవాహ వద్ద యుద్ధం జరిగింది. ఇందులోనూ బాబారుకే విజయం లభించింది. బాబరు సైన్యంలో ఫిరంగులు ఉన్నాయి. అవి మన దేశానికే కొత్త. మెరుగైన ఆయుధాలు, యుద్ధ తంత్రంలో నైపుణ్యం - వీటికే గెలుపు. యుద్ధ తంత్రాన్ని ఒక కళగా సాధన చెయ్యక పోవడం వల్ల రాజపుత్రుల శౌర్యం, తెగింపు నిష్ఫలమయ్యాయి.

విజయనగర సామ్రాజ్య పతనం

దక్షిణ భారతంలో విజయనగర సామ్రాజ్య ఉన్నతిని సహించలేక క్రీ.శ. 1565 లో అహమ్మద్ నగర్, బీజాపూర్, గోల్కొండ సుల్తానులు ఏకమై ఆ రాజ్యం మీద దండెత్తారు. వారికి, విజయ నగర పాలకుడు అళియ రామ రాయలకు తళ్ళికోట వద్ద భీకర యుద్ధం జరిగింది. విజయనగర సైన్యాలు శత్రువులను చెల్లాచెదరు చేసి తరిమికొడుతున్న సమయంలో రామ రాయలు తన సైన్యం లోని ముస్లిం దళాల ద్రోహం వల్ల శత్రువులకు చిక్కి వధించబడ్డాడు. దీంతో అతని సైన్యాలు వెనుదిరిగి పారిపోయాయి. విజయనగరం పతనమైంది. సుల్తానుల సైన్యాలు ఆరు నెలల పాటు విజయ నగరంలో తిష్ట వేసి నగరాన్ని యథేచ్ఛగా దోచుకున్నారు. నగరంలోని ఇళ్లు, భవంతులు, దేవాలయాలు, అందులోని శిల్పాలు వంటి సమస్త కట్టడాలను ఫిరంగులతో ధ్వంసం చేసి, పూర్తిగా నేల మట్టం చేసి, కళకళ లాడే రాజ్యాన్ని భయంకరమైన స్మశానంగా మార్చి వెళ్లారు.

0 comments:

Post a Comment