ప్రపంచ జనాభా ఇంచుమించు 800 కోట్లు. ప్రతి పది నిమిషాలకు 2500 మంది ఉద్యోగాలు కోల్పోతున్నారు. ఈ రోజు పుట్టిన బిడ్డలు పెరిగి పెద్దవుతారు; సందేహం లేదు. అయితే వారికి ఉద్యోగం లభించే రోజు ఎన్నటికీ రాదేమో?!
ఉద్యోగాలు లేకేం, ఉన్నాయి; అయితే వాటిని భర్తీ చేయడానికి సరైన అభ్యర్థులు లభ్యం కావడం లేదని చెప్పడానికి కాబోలు పెద్ద పెద్ద డిగ్రీలు ఉన్న వాళ్ళు అవసరమని అంటున్నారు. తొలుత బిఏ, ఆ తరువాత ఎమ్ఏ అవసరమన్నారు; పిదప బిఎడ్, అనంతరం పిహెచ్‌డి కావాలన్నారు. ఇప్పుడు ఎమ్‌బిఏను డిమాండ్ చేస్తున్నారు. డిగ్రీ స్థాయి విద్య సంగతి ఎలా ఉన్నా అది అసంగతమైనది. ఎందుకంటే మన కళాశాలలు అందిస్తోన్న మౌలిక విద్యలో గత యాభై ఏళ్ళుగా ఎటువంటి మార్పు లేదు కదా. కాకపోతే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఆస్ట్రాలజీ కోర్సులను మాత్రం అదనంగా చేర్చారు. ఆర్ట్స్ విభాగంలో చరిత్ర, సాహిత్యం, భూగోళ, సాంఘిక, రాజనీతి శాస్త్రాలు మొదలైనవి; సైన్సెస్‌లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, ఎందుకూ పనికిరాని జువాలజీ. ఈ విద్యాకోర్సులు చాలవరకు ఆ కోర్సులను బోధించే ఉపాధ్యాయులను మాత్రమే సృష్టిస్తున్నాయి.
అయితే భారతదేశపు అవసరాలు మారిపోయాయి. ఆర్థిక వ్యవస్థలో మౌలిక మార్పులు చోటు చేసుకున్నాయి. భూ కమతాల పరిమాణం అంతకంతకూ తగ్గిపోతోంది. హరిత విప్లవం సమకూర్చిన కలిమి కరిగిపోయింది; కల్మషం మిగిలి ఉత్పత్తి పడిపోతోంది. వేలాది జంతు, వృక్ష జాతులు అంతరించి మానవ జీవితం అవస్థల పాలవుతోంది. వాతావరణం వికృతమవుతోంది. పల్లెలు పచ్చని సీమలన్నది తాతల నాటి మాట. కొత్త సమస్యలను పరిష్కరించుకోవాలంటే విద్యా వ్యవస్థా మారాలి. ప్రపంచంలో అత్యధిక పాఠశాలలు ఉన్న దేశం మనదే. అయితే ఎంతమంది వాటి నుంచి లబ్ధి పొందుతున్నారు? పాఠశాల స్థాయిలో కాకపోయినా కళాశాలస్థాయిలో నైనా మనం కొత్త సబ్జెక్ట్‌లను బోధించవల్సిన అవసరమెంతైనా ఉంది.
మన ఆర్థిక వ్యవస్థలోను, జీవితాలలోను జంతువులు నిర్వహిస్తోన్న పాత్ర గురించి మరి చెప్పాలా? అయితే జంతువుల సంక్షేమానికి తోడ్పడే నిపుణులకు శిక్షణనిచ్చే సరైన విద్యావ్యవస్థలు మనకు ఉన్నాయా? కొన్ని వాస్తవాలు చెబుతాను. 31 పశువైద్య కళాశాలల్లో ప్రధాన అధ్యయనాంశం పశువుల వీర్యదానం. పాఠ్యాంశాల ఆధునికీకరణ చివరిసారి జరిగింది 1930లో! జంతు సంక్షేమానికి పురపాలక సంఘాలు అందిస్తున్న సేవలేమిటి? చెట్లను నరికివేయడంలోనేగానీ వృక్షాలను గుర్తించడంలోగానీ మన అటవీ శాఖ సిబ్బంది శిక్షణ పొందుతున్నారా? మన జాతీయ బడ్జెట్‌లో అటవీ శాఖ వాటా కేవలం 0.5 శాతం మాత్రమే!
మన దేశంలో వన్య ప్రాణుల వైద్యులు లేరు. జూ.నిపుణులు నాస్తి. పక్షులకు అవసరమైన వైద్యులు లేరు. కోతుల ఆరోగ్య బాగోగులు చూసేవారూ లేరు. జింకల, ఏనుగుల సంగతీ అంతే. పులులకూ డాక్టర్లు లేరు. అవసరమైన సబ్జెక్ట్స్‌లో ప్రత్యేక శిక్షణ పొందడానికై విదేశాలకు వెళ్ళేందుకు ఉపకార వేతనాలు అసలే లేవు. జంతువులకు బీమా సదుపాయం విషయమై మరి చెప్పనక్కర లేదు. రవాణాదారులుగా, ఇంధన ఆదాదారులుగా, ఎరువులు సమకూర్చేవిగా, చివరకు చెత్తా చెదారాన్ని దూరంగా పారవేసి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంలో జంతువుల పాత్రను మనం కనీస మాత్రంగానైనా గుర్తిస్తున్నామా?
కబేళాల నిర్వహణలో మన నిపుణ నైపుణ్యాలేమిటి? జంతువుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని సరుకుల రవాణాకు ఉపయోగించే బళ్ళను రూపొందిస్తున్నామా? ఆ బళ్ళనులాగే దున్నపోతులలో 40 శాతం మెడ కేన్సర్లతో మూడేళ్ళలో చనిపోతున్నాయి. మాంసాహారం మూలంగా సోకే కేన్సర్లపై మనకు అవగాహన ఉందా? మాంసం దుకాణాలను ఏర్పాటు చేసే ప్రదేశాలు, లైసెన్స్‌లు జారీకి సంబంధించిన చట్టాలను పటిష్టంగా అమలుపరుస్తున్నామా? ఈ ప్రశ్నలకు అంతులేదు.
ఇలాంటి పరిస్థితులలో పొట్టి కొమ్ముల దుప్పి, కోతుల, చిరుతపులుల, శునకాల ఆరోగ్య సమస్యలను ఎలా పరిష్కరిస్తారు? రోగగ్రస్థ జంతువును చంపివేస్తే సరిపోతుందేమో?! ఇలా అసలు ఆ జంతువు దాదాపుగా అంతరించిపోయేదాకా చేస్తారు; ఆ తరువాత ఆ జంతువును రక్షించడానికి నానా పాట్లు (ఆర్థికంగా కూడా) పడతారు. చిరుత పులుల విషయంలో ఇదే కదా జరిగింది. సరే, పక్షులు వాలే చెట్లు కన్పించడం లేదేమిటి? గుర్రాలు గతంలో వలే ఎక్కువ కాలం ఎందుకు జీవించలేకపోతున్నాయి?
యూరోపియన్ దేశాలలోని పశువుల ఆహారమైన సోయాను సాగుచేయడానికి మధ్యప్రదేశ్‌లోని వ్యవసాయ భూములన్నిటినీ ఎందుకు వినియోగిస్తున్నారు? ఆహారంగా పనికిరాని మాంస భాగాలను పారవేస్తోంది సరస్సులు, నదులలో కాదూ? చైనా ప్రత్యామ్నాయ తోలు సాంకేతికతలను సృష్టించింది. మరి మన మాటేమిటి? గోబర్ గ్యాస్‌తో వంటచేసే విధానాలను మన మహిళలకు ఎలా నేర్పుతారు? సకల రంగాలలోను మన విధానాల రూపకల్పన బాధ్యతలలోకి ప్రవేశించి దేశపాలనను రైతుల, పేదల సంక్షేమానికి, ఆరోగ్య భద్రతకు అనుకూలంగా చేసేందుకు ఒక తరం సుశిక్షిత వృత్తి నిపుణుల అవసరం ఉన్నది. మనం జంతువులపై ఎంతగా ఆధారపడి ఉన్నామన్న విషయాన్ని గుర్తించినప్పుడే ఇది సాధ్యమవుతుంది.
ఈ వాస్తవాలను దృష్టిలో ఉంచుకొనే జంతు సంక్షేమం, సంబంధిత అంశాలపై ఒక విశ్వవిద్యాలయం ఏర్పాటుకు పూనుకున్నాను. 2002లో ఫరీదాబాద్‌లో దానిని నెలకొల్పాను. ఎనిమిది ఎకరాల వైశాల్యంలో భవన నిర్మాణం కూడా జరిగింది. బోధన, బోధనేతర సిబ్బంది నియామకాలకు ప్రభుత్వ అనుమతి లభించింది. తొలుత ఆక్స్‌ఫర్డ్, కేంబ్రిడ్జి, యేల్ మొదలైన విశ్వవిద్యాలయాల ఆచార్యులు కొంతమంది ఫరీదాబాద్ వర్సిటీకి రావడానికి అంగీకరించారు. యుఎన్ఇపి నుంచి గ్రంథాలయానికి నిధులు మంజూరయ్యాయి.
మొత్తం 43 కోర్సుల బోధనకు ఏర్పాట్లు జరిగాయి. డీమ్డ్ యూనివర్సిటీగా గుర్తింపు నివ్వాలనే ప్రతిపాదనను ప్రభుత్వం చురుగ్గా పరిశీలించింది. జంతు సంక్షేమానికి రూపొందించిన కోర్సులలో కొన్ని-యానిమల్ న్యూట్రిషన్, కమర్షియల్ ఫ్యాక్టరీ, జూ అండ్ లేబొరేటరీ మేనేజ్‌మెంట్, ఆర్గానిక్ ఫార్మింగ్, బర్డ్ కేర్, వెటెరినరీ ఫార్మసీ, వాటర్ అండ్ ఫారెస్ట్ మేనేజ్ మెంట్, కబేళా నిర్వహణ మొదలైనవి. ఇక బయాలజీ, ఫిజియాలజీ, అనాటమీ మొదలైనవి ఎలాగూ తప్పనిసరి కదా.
ఈ సబ్జెక్ట్స్‌లో నాలుగేళ్ళ బిఏ కోర్సుతో పాటు, ఒకటి రెండు సంవత్సరాల కోర్సులు కూడా ఉంటాయి. పోలీసు, మునిసిపల్ ఉద్యోగులకు స్వల్పకాలిక కోర్సులు రూపొందించాము. ఆ విశ్వవిద్యాలయానికి 'నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ యానిమల్ వేల్ఫేర్' (ఎన్ఐఎడబ్ల్యు) అని పేరు పెట్టాము. అది సక్రమంగా సాగివుంటే జంతువులకు సంబంధించిన మన ఆలోచనలు సమూలంగా మారిపోయివుండేవి. ఒకప్పుడు మన దేశంలోని న్యాయశాస్త్ర కళాశాలల పరిస్థితి చాలాఘోరంగా ఉండేది. లా కోర్సులను అందరూ చాలా తేలిగ్గా చూసేవారు. అయితే బెంగుళూర్ లా స్కూల్ నేర్పాటు చేసిన తరువాత ఆ పరిస్థితి మారిపోయింది.
దేశ వ్యాప్తంగా ప్రతి లా కళాశాలకు, ప్రతి న్యాయశాస్త్ర విభాగానికి బెంగుళూరు లా స్కూల్ ఒక కొత్త స్ఫూర్తి అయింది. న్యాయశాస్త్ర అధ్యయనం, బోధనలో మౌలిక మార్పులు సంభవించాయి. ఎన్ ఐ ఎ డబ్ల్యు పట్టభద్రులకు ఉద్యోగాలు దొరికేవేనా? ఎందుకు దొరకవు? సిటీ మేనేజ్‌మెంట్, వైల్డ్ లైఫ్, లేబొరేటరీస్, ఆస్పత్రులు, షెల్టర్స్, ఎన్ జి ఓలు, కబేళాలు, జంతు ప్రదర్శన శాలలు, పశు వైద్య కేంద్రాలు, పురపాలకసంఘాలు, పరిశ్రమలు....... ఇంకా ప్రపంచవ్యాప్తంగా వేలాది కన్సల్టెన్సీలు ఉన్నాయి.
ప్రపంచంలో 62 విశ్వవిద్యాలయాలు జంతుసంక్షేమంపై కోర్సులు నిర్వహిస్తున్నాయి. ప్రతి విశ్వవిద్యాలయాన్నీ సంప్రదించాము. మాకు సహాయమందించడానికి అందరూ అంగీకరించారు. సంకల్పించినదంతా ఆచరణలోకి వచ్చివుంటే ప్రతి ఒక్కరూ జంతు సంక్షేమంపై విశేష శ్రద్ధ చూపేవారు. డిగ్రీ కూడా పొందేవారు. సుశిక్షితులైన వారి అవసరం ఉన్న ప్రతిరంగంలోనూ వేలాది ఉద్యోగాలు ఉన్నాయి.
ఇంతలో అంటే 2002లో నన్ను కేంద్ర మంత్రి మండలి నుంచి తొలగించారు. ఎన్ఐఎ డబ్ల్యును పర్యావరణ మంత్రిత్వ శాఖకు అప్పగించారు. ఎన్డీఏ ప్రభుత్వం దాన్ని మరచిపోయింది. అమిటీ తదితర ప్రైవేట్ విశ్వవిద్యాలయాలు దాన్ని నిర్వహించడానికి ముందుకు వచ్చాయి. అయితే పర్యావరణ మంత్రిత్వ శాఖ సుముఖత చూపలేదు. జంతువుల పట్ల 'కరుణ' చూపడంలో ప్రభుత్వోద్యోగులకు రెండురోజుల కోర్సులను ప్రవేశపెట్టింది. ఆ తరువాత జంతువులకు సంబంధించిన చట్టాలపై ఉక్కు, బొగ్గు మంత్రిత్వ శాఖలకు చెందిన క్రింది స్థాయి ఉద్యోగులకు మూడు రోజుల కోర్సులు నిర్వహించారు.
గత ఆరేళ్ళలో వారు ఇలా అర్థంపర్థం లేని 40 కార్యక్రమాలను నిర్వహించారు. ఎన్ఐఎడబ్ల్యు కు సరైన నిర్వహణ లేదు. సిబ్బంది ఏలరు. ఈ కోర్సులను ఆయా మంత్రిత్వ శాఖల జాయింట్ సెక్రటరీలు బోధిస్తున్నారు. ట్రిపిల్ థియరిమ్స్ గురించి నాకు ఎంత తెలుసో ఆ ఐఏఎస్ బాబులకు జంతు సంక్షేమం, చట్టాల గురించి అంతే తెలుసు మరి. ఈ సంస్థకు కేటాయించిన నిధులను జనరల్ బడ్జెట్‌కి మళ్ళించారు. ఎన్ఐఎడబ్యుని భారత ప్రభుత్వ ఆధ్వర్యంలోని జంతుసంక్షేమ సంస్థకు అప్పగించాలని నేను చేసిన ప్రతి విజ్ఞప్తీ బధిరుని ముందు శంఖారావమే అయిపోయింది.
మన ప్రభుత్వాధికారులలో కొత్త భావాల పట్ల వ్యతిరేకత, బద్ధకం, స్వార్థపరత్వం మూలంగా దేశ శ్రేయస్సుకు తోడ్పడే ఇంకెన్నో అద్భుత అవకాశాలు వ్యర్ధమైపోతున్నాయి. ఎన్ఐఎడబ్ల్యు గత ఆరేళ్ళుగా సక్రమంగా సాగివుంటే ఇప్పటికి ఎంతో మంది జంతు సంక్షేమ నిపుణులు తయారయివుండేవారు; పులులను, సీతాకోకచిలుకలను, మిగతా భారతదేశాన్ని రక్షించగలిగి వుండేవారు.
(ఆంధ్రజ్యోతికి ప్రత్యేకం)
ఇదీ మన భారత్ - మేనకా గాంధీ
Info Post
0 comments:
Post a Comment