మోహన్‌దాస్ కరంచంద్ గాంధీ, ఆయన సతీమణి, వారి పిల్లలు గత శతాబ్ది మొదటి దశకం నడిమి సంవత్సరాలలో జోహాన్స్‌బర్గ్‌లో ఇంగ్లీషు వారైన పోలక్ దంపతుల (హెన్రీ, మిల్లీ)తో కలిసి ఒకే ఇంటిలో ఉన్నారు. ఆ ఇంగ్లీష్ కుటుంబంతో తమ సహ జీవనం గురించి తదనంతర కాలంలో గాంధీ ఇలా రాశారు: 'పిల్లల విద్యాభ్యాసం ఆంగ్ల మాధ్యమంలో జరగడం వాంఛనీయమా కాదా అనే విషయమై హెన్రీ పోలక్, నేనూ తరచు తీవ్రంగా చర్చిస్తుండేవాళ్ళం.
పిల్లలు, బాల్యం నుంచి ఆంగ్లంలోనే ఆలోచించడానికి, మాట్లాడడానికి శిక్షణ ఇచ్చే భారతీయ తల్లితండ్రులు తమ పిల్లలకూ, దేశానికి ద్రోహం చేస్తున్నారనేది నా సునిశ్చిత విశ్వాసం. అటువంటి తల్లిదండ్రులు తమ పిల్లలు, జాతి ఆధ్యాత్మిక, సామాజిక సంస్కృతికి వారసులు కాకుండా చేసి, దేశ సేవకు పనికిరానివారుగా చేస్తున్నారు. ఈ ప్రగాఢ విశ్వాసాల కారణంగా నేను నా పిల్లలతో ఎప్పుడూ గుజరాతీలోనే మాట్లాడే వాణ్ణి. పోలక్‌కు ఇది ఎంతమాత్రం నచ్చేది కాదు. నేను వారి భవిష్యత్తుకు హాని చేస్తున్నానని పోలక్ భావించేవారు.
పిల్లల విద్యాభ్యాసం బాల్యం నుంచీ ఇంగ్లీష్‌లో జరిగితే జీవిత గమనంలో వారు ఇతరుల కంటే ముందంజలో ఉండి గొప్ప ప్రయోజం పొందుతారని పోలక్ వాదిస్తుండేవారు. నన్ను ఒప్పించడంలో ఆయన విఫలమయ్యారు'. గాంధీ ఇంకా ఇలా రాశారు: 'పిల్లలు ఇంటి వద్ద గుజరాతీలోనే మాట్లాడాలని, ఆ భాషలోనే చదువుకోవాలని నేను ఎంతగా పట్టుబట్టినప్పటికీ ఆంగ్ల భాషలో మాట్లాడడం, రాయడంలో మా పిల్లలు మంచి ప్రావీణ్యం సంపాదించారు. నిత్యం ఇంగ్లీషు స్నేహితులతో కలసిమెలసి ఉండడం వల్లను, ఇంగ్లీషు ప్రధాన భాషగా ఉన్న దక్షిణాఫ్రికాలో నివశిస్తుండడం వల్లను వారికది సాధ్యమయింది'.
గాంధీ, పోలక్ మధ్య చోటుచేసుకున్న ఈ వ్యక్తిగత చర్చకు దశాబ్దాలుగా చాలా బహిరంగ ప్రతిధ్వనులు ఉన్నాయి. ఆంగ్ల భాష పట్ల అనురక్తి పరాయి పాలనలో ఉన్న ప్రజల మనస్తత్వాన్ని ప్రతిబింబిస్తుందా లేదా అనే విషయమై గాంధీ, రవీంద్రుడు 1920ల్లో పత్రికల్లో చర్చించారు. భారతీయులు ఇంగ్లీషుకిస్తున్న ప్రాధాన్యం పారతంత్య్ర మనస్తత్వాన్ని తెలియజేస్తుందని గాంధీ అభిప్రాయపడగా భారతీయులు తమ ప్రశస్థతను సమున్నతం చేసుకోవడానికి మాతృభాషేతర భాషల, సాహిత్యాల గొప్పతనాన్ని కూడా ఆవాహన చేసుకోవాలని విశ్వకవి వాదించారు.
స్వాతంత్య్రానంతరం ఈ భిన్న వైఖరుల మధ్య ఘర్షణ తీవ్రమయింది. భారతదేశం నుంచి ఆంగ్ల భాషను పూర్తిగా బహిష్కరించడానికి సోషలిస్టు నాయకుడు రామ్ మనోహర్ లోహియా 'అం గ్రేజీ హఠావో' ఉద్యమాన్ని ప్రారంభించారు (బ్రిటన్ సార్వభౌమాధినేత రెండో ఎలిజబెత్ రాణి భారత్‌ను సందర్శించిన సందర్భం గా లోహియా ఆ ఉద్యమాన్ని తీవ్రతరం చేశారు) లోహియా ఉద్యమానికి తమిళనాడు రాజకీయవేత్తలు, మేధావులు ధీటుగా ప్రతిస్పందించారు.
ఆంగ్ల భాషను బహిష్కరిస్తే హిందీ భాషీయు లు దక్షిణ, పశ్చిమ, తూర్పు భారత రాష్ట్రాలపై వలసవాద పెత్తనం చేస్తారని తమిళ తంబీలు భావించారు. లోహియా వలే ప్రతిభావంతుడైన ఇ.వి.రామస్వామి నాయకర్ (పెరియార్) అనుయాయులు తమిళనాడులో హిందీ చిహ్నాలన్నిటినీ చెరిపివేశారు.
పెరియార్ పాత ప్రత్యర్థి సి.రాజగోపాలాచారి హిందీ వ్యతిరేక ఉద్యమంలో ప్రముఖ పాత్ర వహించారు. భారత్‌లోని వివిధ రాష్ట్రాల మధ్య, భారత్, ఇతర దేశాల మధ్య భావ ప్రసార మాధ్యమంగా ఆంగ్ల భాషనే ఉపయోగించుకోవాలని ఆయన వాదించారు. ఆంగ్ల భాష విదేశీ భాష అని, అంతేకాక అది సామ్రాజ్యవాద భాష అన్న వాదనకు రాజాజీ ఇలా సమాధానమిచ్చారు: 'చదువుల తల్లి సరస్వతి మానవాళి మాట్లాడే భాషలన్నిటికీ జన్మనిచ్చినందున ఇంగ్లీష్ భాషనూ మన సొంత భాషగానే భావించాలి'.
ఆ చర్చ కొనసాగుతోంది. కర్ణాటకలో పలువురు ప్రముఖ మేధావులు ముఖ్యంగా నవలా రచయిత యు.ఆర్.అనంతమూర్తి ఉన్నత పాఠశాలలో ప్రవేశించేంత వరకు బాలలు తమ మాతృభాషలోనే విద్యాభ్యాసం చేయాలని గట్టిగా అభిప్రాయపడ్డారు. లేని పక్షంలో వారు తమ సామాజిక, ఆధ్యాత్మిక మూలాలతో సంబంధాలను కోల్పోతారని ఆయన వాదించారు (గాంధీ అభిమాని అయిన అనంతమూర్తి లోహి యా మాజీ శిష్యులలో ఒకరు.
అయితే తన వాదనలను మౌలిక చింతన, ఉపజ్ఞతో చేసే మేధావి). మరో వైపు దళిత బుద్ధి జీవులు, కన్నడాన్ని ప్రోత్సహించడం ఆధునిక విద్య తమకు అందుబాటులో లేకుండా చేసేందుకు ఉన్నత వర్గాల వారి పన్నాగమని గట్టిగా భావిస్తున్నారు. ఒకప్పుడు బ్రాహ్మిన్స్ తమకు సంస్కృతాన్ని అందుబాటులో లేకుండా చేశారని, వారి వర్తమాన వారసులు దళితులకు ఆధునిక అంతర్జాతీయ భాష ఇంగ్లీషు అందుబాటులో లేకుండా చేయాలని ఆశిస్తున్నారని దళిత మేధావులు విమర్శిస్తున్నారు.
అణగారిన వర్గాల వారు విదేశీ భాష ఆంగ్లాన్ని సమర్థించడం ఉత్తర భారతావనిలో చాలా ఆసక్తికరమైన రూపాన్ని తీసుకొంది. రచయిత - ఉద్యమకారుడు అయిన చంద్రభాన్ ప్రసాద్ తన సొంత రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌లో 'ఇంగ్లీష్ సరస్వతి' (గాడెసెస్ ఇంగ్లీష్)కి ఒక ఆలయాన్ని నిర్మించారు. ఆంగ్ల భాషను లోతుగా, సమగ్రంగా అభ్యసించడం ద్వారా దళితులు సకల అణచివేతల నుంచి సంపూర్ణ విముక్తి పొందగలరని చంద్రభాన్ ప్రసాద్ విశ్వసిస్తున్నారు.
ఆంగ్ల మాధ్యమంలో విద్యాభ్యాసం విషయమై జోహాన్స్‌బర్గ్‌లో గాంధీ, పోలక్‌ల మధ్య చర్చ జరిగిన శతాబ్దం అనంతరం భారత్‌కు, భారతీయులకు ఇంగ్లీషు ఉపయుక్తత గురించి వాదప్రతివాదాలు కొనసాగుతున్నాయి. అప్పటికీ ఇప్పటికీ సమాజమూ, చరిత్రా చాలా దూరం ప్రయాణించాయి. అలాగే ఆంగ్ల భాషా అవసరంపై చర్చ కూడా బాగా పురోగమించింది. గాంధీ కాలం నాటికి ఇప్పటికీ మూడు ముఖ్యమార్పులు మనకు స్పష్టంగా కనపడతాయి.
మొదటిది- గతంలో కంటే ఇప్పుడు కులాంతర, మతాంతర, ప్రాంతేతర వివాహాలు ముఖ్యంగా మధ్యతరగతి, ఉన్నత వర్గాల వారిలో చాలా ఎక్కువగా జరుగుతున్నాయి. ఒక గుజరాతీ వ్యక్తి ఒక తమిళ భాషీయురాలిని వి వాహం చేసుకున్నా, ఒక బెంగాలీ మహిళ ఒక మళయాళీ వ్యక్తిని పెళ్ళిచేసుకున్నా వారి పిల్లలు, మొత్తం కుటుంబం ఆంగ్ల భాషలోనే మాట్లాడుకోవడం అనివార్యమవుతుంది. రెండోది-రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం అంతరించింది.
ఆంగ్ల భాష ప్రపంచ భాషగా వర్ధిల్లుతున్నా, వర్తమాన యుగపు మహాశక్తిమంతమైన సామ్రాజ్యవాద శక్తిగా బ్రిటన్ స్థానంలో అమెరికా వెలుగొందుతోంది. ఇంగ్లీష్‌ను బ్రిటిష్ యాసలో మాట్లాడినా లేదా అమెరికన్ యాసలో సంభాషించినా ప్రపంచవ్యాప్తంగా వివిధ జాతుల ప్రజలు పరస్పర భావప్రసార వాహికగా ఆ భాషకే ప్రాధాన్యమిస్తున్నారు. మూడో మార్పు పేద ప్రజల్లో ఇంగ్లీష్ నేర్చుకోవాలన్న మహాఆరాటం అంతకంతకూ అధికమవుతుండడం (భారతీయ పరిస్థితుల నేపథ్యంలో ఇదే చాలా ముఖ్యమైన మార్పు).
పాఠకులు తమ సొంత అనుభవం నుంచి ఈ మార్పును గుర్తించగలరు. తమ గృహాలలో పనిచేసే సేవకులు, వారి పిల్లలకు ఇంగ్లీష్ చదువు చెప్పించడానికి ఎంతగా ఆరాటపడుతున్నారో, అందుకు ఎంతగా శ్రమిస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తమ పిల్లలు తమ వలే సేవక వృత్తిలో బతకడానికి పేదలు విముఖంగా ఉండడమే ఇందుకు కారణం. వంశపారంపర్య బానిసత్వం నుంచి బయటపడి సమాజంలో హుందాగా బతకడానికి, ఉన్నతస్థాయికి చేరుకోవడానికి తమ పిల్లలను ఆంగ్ల మాధ్యమంలో విద్యావంతులను చేయడమే ఏకైక మార్గంగా బడుగువర్గాల వారు గట్టిగా భావిస్తున్నారు. సకల కులాలు, సామాజికవర్గాలవారిలో ఆంగ్లభాషా ఆరాటం ప్రగాఢంగా ఉంది.
ఇంగ్లీష్‌చదువు పట్ల పేద ముస్లింలు ఎంత ఆసక్తితో ఉన్నారో పేద దళితులు, ఆదివాసీలు కూడా అంతే ఆసక్తితో ఉన్నారు. ఒకరు అంగీకరించినా అంగీకరించకపోయినా ఆంగ్ల భాషలో విద్యాభ్యాసానికి సమాజంలోని పేదవర్గాలలో పెరుగుతోన్న ఆరాటాన్ని ఎవరూ అడ్డుకోలేరు. భారతీయ బాలల ఊహాపోహలనుంచి లేదా విద్యాభ్యాస అనుభవాల నుంచి ఆంగ్లాన్ని పూర్తిగా బహిష్కరించడానికి తాము ప్రారంభించిన పోరాటంలో లోహియా, ఆయన అనుచరులు విజితులయ్యారు. గాంధీ, పోలక్‌ల భిన్నవైఖరుల మధ్య ఒక విధమైన రాజీని ఎవరైనా ఇప్పటికీ అభిలషించవచ్చు.
భాషా పరంగా, సాహిత్య సంప్రదాయాల పరంగా అసాధారణ వైవిధ్యమున్న దేశం మనది. అయితే జీవన కార్యకలాపాల్లో ఒక భాషకే ప్రాధాన్యమిస్తూ మిగతాభాషలను నిర్లక్ష్యం చేస్తున్నాము. మధ్యతరగతి, ఉన్నతవర్గాల భారతీయులలో అత్యధికులు ఇంగ్లీష్‌ను మాత్రమే మాట్లాడడం చాలా సిగ్గుచేటు; బడుగు, శ్రామిక వర్గాల వారిలో అత్యధికులకు ఆంగ్లమాధ్యమంలో విద్యాభ్యాసానికి అవకాశాలు అందుబాటులో లేక పోవడమూ అంతే సిగ్గుచేటు.
సరే గాంధీగారి పిల్లలు, గుజరాతీలోనే మాట్లాడాలని, చదువుకోవాలని తమ తండ్రి ఎంతగా పట్టుబట్టినప్పటికీ వారి జోహాన్స్‌బర్గ్ ప్రజాభాష (లింగ్వాఫ్రాంకా)లో ప్రావీణ్యం సాధించారు. ప్రావీణ్యులయ్యారు. అదృష్టవశాత్తు అది ప్రపంచ ప్రజాభాష-ఇంగ్లీష్. భారతీయులు నివశిస్తున్న వర్గపరమై న, భాషాపరమైన పరిధుల్లో ద్విభాషా వాదం, బహుభాషా వాదం ను ప్రోత్సహించడం చాలా కష్టమైన పని.
ఉన్నత వర్గాలవారి పిల్ల లు కొద్ది పాటి హిందీ (లేదా మరాఠీ లేదా కన్నడ) భాషా పరిజ్ఞానాన్ని సంపాదించుకోవడం సులువే; అయితే ఆ భాష లేదా భాషలను సమగ్రంగా, ఆ భాష(ల)లోని సాహిత్యాన్ని చదవగల పరిజ్ఞానాన్ని సంపాదించుకొంటే వారు మరింత విశాల ఆలోచనాపరులవుతారు కదా. బడుగు, శ్రామిక కుటుంబాల పిల్లలు ప్రయోజనకరమైన పరిజ్ఞానానికి మించి ఆంగ్ల భాషను నేర్చుకోవడానికి వారి ఆర్థిక స్తోమత, సామాజిక పరిస్థితులూ అవరోధంగా ఉన్నాయి.
గాంధీ ఆదర్శప్రాయుడైన తండ్రిగా ప్రసిద్ధుడేమీ కాదు. అయితే భాషా కౌశలాల విషయంలో ఆయన పిల్లలు ఇతర భారతీయుల కంటే చాలా అదృష్టవంతులు. ద్విభాషీయత- ఇంటిలో మాట్లాడుకొనే భాషతో పాటు, నివశిస్తున్న నగరంలోని ప్రజాభాష) వారికి సహజంగా సమకూరింది. అయితే వర్తమాన భారతదేశంలో అర్థవంతమైన ద్విభాషీయత అత్యధికులకు అంటరానిదిగానే ఉండిపోయింది.
(ఆంధ్రజ్యోతికి ప్రత్యేకం)
'ఆంగ్ల సరస్వతి' ఆరాధన - రామచంద్ర గుహ
Info Post
0 comments:
Post a Comment