Breaking News
Loading...
Monday, 9 May 2011

Info Post
ఒసామాపై నేను గతంలో వ్రాసిన బ్లాగ్ పోస్టులో (మే 5, 2011) ఒసామా ఉదంతం తరువాత కూడా పాకిస్తాన్, అమెరికాల సంబంధాలు పెద్దగా చెడిపోయే అవకాశాలు లేవని, అమెరికా పాకిస్తాన్ తో సంబంధాలను యథాతథంగా కొనసాగిస్తుందని చెప్పాను. పాకిస్తాన్ కు ఏదో ఒక స్థాయిలో తెలియకుండానే ఆపరేషన్ జెరోనిమో జరిగి ఉండే అవకాశాలూ లేవని చెప్పాను. ఆపరేషన్ ఒసామా వల్ల భారత్ కి పెద్దగా ఒరిగేదేమీ లేదని, మన అప్రమత్తత కొనసాగాల్సిందేనని, అమెరికాని ఎంత దువ్వినా లాభం ఉండబోదని కూడా వ్రాశాను.

తాజా పరిణామాలు నా అంచనాను ధ్రువీకరిస్తున్నాయి. కేవలం నాలుగైదు అంశాలను మీ దృష్టికి తీసుకురాదలచుకున్నాను.
పాకిస్తాన్ పాలకుల వ్యవహారాలు మామూలుగా కొనసాగుతున్నాయి. దేశాధ్యక్షుడు జర్దారీ కువైట్ పర్యటనలో ఉన్నారు. కువైట్ అమెరికాకి అత్యంత సన్నిహిత దేశాల్లో ఒకటి. అసలు కువైట్ కోసమే సద్దామ్ పై ఆపరేషన్ డిజర్ట్ స్టార్మ్ యుద్ధం జరిగిందన్నది ఈ సందర్భంగా మరిచిపోరాదు. పాక్ ఐఎస్ ఐ చీఫ్ షూజా పాషా అమెరికాలో ఉన్నారు. మాజీ విదేశాంగ మంత్రి షెర్రీ రహమాన్ జెనీవాలో పర్యటిస్తున్నారు. ప్రధాని గిలానీ సోమవారం నుంచి మొదలయ్యే చట్టసభల సమావేశాలకి రెడీ అవుతున్నారు. మాజీ ప్రధాని, ప్రధాన విపక్ష నేత నవాజ్ షరీఫ్ ఇంగ్లండ్ నుంచి సోమవారానికి పాకిస్తాన్ చేరుకుంటారు. ఇన్నాళ్లూ ఆయన అక్కడ పర్యటనలో ఉన్నారు. కాబట్టి పాకిస్తాన్ లో ఆల్ ఈజ్ వెల్.

పాకిస్తాన్ ప్రభుత్వానికి, సైన్యానికి తాయిలాలు ఇచ్చి, బుజ్జగింపులు చేసే ప్రక్రియ కూడా మొదలైంది. వైట్ హౌస్ భద్రతా విషయాల సలహాదారు టామ్ డోనిలాన్ సైన్యం సర్వోచ్చ నాయకత్వానికి, ఐఎస్ ఐ టాప్ లీడర్ షిప్ కీ ఒసామా అబ్బొటాబాద్ లో ఉన్నట్టు తెలిసి ఉండకపోవచ్చునని బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఇచ్చారు. ఇది ఆయన సుప్రసిద్ధ జర్నలిస్టు క్రిస్టీన్ అమ్మాన్ పోర్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఉగ్రవాద వ్యతిరేకపోరులో పాకిస్తాన్ చాలా త్యాగాలు చేసిందని, చాలామంది పౌరులు చనిపోయారని ఆయన అనడం గమనార్హం. పాకిస్తాన్ తో మైత్రి యథాతథంగా కొనసాగుతుందని కూడా ఆయన అన్నారు.
ఒసామా స్థావరంలో అరెస్టయిన వారు, ముఖ్యంగా ఒసామా భార్యలు, పాకిస్తాన్ పోలీసుల చేతిలో ఉన్నారు. వీరందరితో పాటూ అమెరికన్ సైనికులు తీసుకెళ్లని చాలా సమాచారం పాకిస్తాన్ అధికారుల చేతుల్లోకి చేరింది. ఇప్పుడు ఈ సమాచారాన్ని తమతో పంచుకోవాలని, పాక్ ఖైదులో ఉన్న ఒసామా అనుచరులను ప్రశ్నించేందుకు అనుమతించాలని అమెరికా కోరుకుంటోంది. ఇది కూడా పాకిస్తాన్ అవసరం అమెరికాకు ఎంతుందో తెలియచేస్తుంది.

భారత్ కూడా ఆపరేషన్ జెరోనిమో వంటి ఆపరేషన్ నిర్వహించి పాకిస్తాన్ లో దాగున్న ఉగ్రవాదులను పట్టుకునే ప్రయత్నాలు చేయడం సరైనది కాదని అమెరికా ఇప్పటికే ప్రకటించింది. అంటే పరోక్షంగా పాకిస్తాన్ కొమ్ము కాసినట్టే. గత వ్యాసంలో చెప్పినట్టు పాకిస్తాన్ వంటి బ్రిడ్జి స్టేట్ ను అమెరికా అంత తేలిగ్గా వదలడం అసాధ్యం.

అమెరికాకు పాకిస్తాన్ ఉగ్రవాద స్థావరం అన్న విషయం ముందునుంచే తెలుసు. 2004 లో తాజికిస్తాన్ ఒసామా పాకిస్తాన్ లో ఉన్నట్టు తెలియచేసింది. మన దేశ గూఢచారి వర్గాలు కూడా ఇదే విషయాన్ని ధ్రువీకరించాయి. దీనికి తోడు ఒసామా కోసం కొండల్లో వెతకడం వృథా అని, అతను పాకిస్తాన్ లోని నగరాల్లో ఉన్నాడని భారత గూఢచారి వర్గాలు అమెరికాకు తెలియచేశాయి. జనవరి 2011లో ఇండొనీషియాలో అల్ కాయిదా అనుబంధ సంస్థ జెమా ఇస్లామియా కీలక నేత ఉమర్ పాటెక్ అబ్బటాబాద్ లోనే అరెస్టయ్యాడు. ఆయన అల్ కాయిదా అగ్రనేతలను కలుసుకునేందుకు వచ్చినప్పుడే దొరికిపోయాడు. ఈ సంఘటన జరిగిన తరువాత కూడా ఒసామా అబ్బొటాబాద్ వదల లేదన్నదే ఇక్కడ కీలక విషయం.
ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం ఉంది. 1999 నుంచి 2008 వరకూ పాకిస్తాన్ ను పాలించిన సైనిక నియంత పర్వేజ్ ముషర్రఫ్ తన ఆత్మకథ "ఇన్ ది లైన్ ఆఫ్ ఫైర్ - ఎ మెమాయిర్"లో ఒసామాను పట్టుకునేందుకు 2004లో రెండు సార్లు ప్రయత్నించినట్టు వెల్లడించాడు. అంతే కాదు...అబ్బొటాబాద్ లో అల్ కాయెదా అగ్రనేతలు ఒక ఇంటిని అద్దెకు తీసుకున్నట్టు, నిజానికి మూడు ఇళ్లను అల్ కాయెదా ఉపయోగిస్తున్నట్టు ఆయన వ్రాశారు. అంతే కాదు...2003లో అబ్బొటాబాద్ లోని ఒక ఇంటి నుంచి అల్ కాయిదా మూడో అగ్రనేత అబూ ఫరాజ్ అల్ లిబ్బి అరెస్టయ్యాడు. 2009లో ఇప్పుడు ఒసామా నివసించిన భవనంపై ఐఎస్ ఐ నిఘా ఉండేదని పాక్ విదేశాంగ శాఖ కార్యదర్శి సల్మాన్ బషీర్ స్వయంగా ప్రకటించారు. అబ్బొటాబాద్ లో కాశ్మీరీ ఉగ్రవాదులకు శిక్షణ నిచ్చేవారన్నది, 2001 జులైలో అఫ్గన్ తాలిబాన్లు ఇక్కడే మూడు రోజుల శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. బాలి ఉగ్రవాద దాడుల కీలక ఉగ్రవాది అసదుల్లా జాన్ కూడా 2002 లో అబ్బొటాబాద్ లోనే అరెస్టయ్యాడు.
ఒసామా స్థావరంపై దాడిచేసిన బ్లాక్ హాక్ హెలికాప్టర్లను స్టెల్త్ హెలికాప్టర్లు అంటున్నారు. వీటి శబ్దం చాలా తక్కువగా ఉంటుందని కూడా చెబుతున్నారు. కానీ హెలికాప్టర్ శబ్దం భయంకరంగా ఉందని దాడి సమయంలో వచ్చిన ట్విట్టర్ ట్వీట్ లు చెబుతున్నాయి. అయినా పాకిస్తాన్ సైన్యం ఎందుకు స్పందించలేదు?

ఒసామా 2005 నుంచే అబ్బొటాబాద్ లో ఉన్నాడని ఇప్పుడు తెలుస్తోంది. ఆ సమయంలో అమెరికాతో, అప్పటి పాక్ దేశాధ్యక్షుడు ముషర్రఫ్ తో సన్నిహిత సంబంధాలున్న అష్పాక్ పర్వేజ్ కయానీ ఐఎస్ ఐ చీఫ్ గా ఉన్నారు. ఆయనే ఇప్పటి సర్వసేనాని. ఆయన తరువాత జనరల్ నదీమ్ తాజ్ ఐఎస్ ఐ చీఫ్ గా పనిచేశారు. నదీమ్ తాజ్ ముషర్రఫ్ కి దూరపు బంధువు కూడా. ముషర్రఫ్ ను సైన్యాధ్యక్ష పదవినుంచి తొలగించేందుకు అప్పటి ప్రధాని నవాజ్ షరీఫ్ 1999 లో ప్రయత్నించినప్పుడు ముషర్రఫ్ హుటాహుటిన శ్రీలంక నుంచి విమానంలో పాకిస్తాన్ కి తిరిగి వచ్చారు. నదీమ్ తాజ్ ఆయనతో పాటూ ప్రయాణించారంటేనే ఆయన ముషర్రఫ్ కి ఎంత చేరువో అర్థం చేసుకోవచ్చు. ఈయన నవంబర్ 2007 లో బాధ్యతలు స్వీకరించారు. ఈయన తరువాతే ప్రస్తుత ఐఎస్ ఐ చీఫ్ షూజా పాషా బాధ్యతలు స్వీకరించారు. కాబట్టి వీరందరికీ ఒసామా గురించి ఎంతో కొంత తెలిసి ఉండాలి.

పాకిస్తాన్ లో ఒసామా పట్ల, జెహాద్ పట్ల, ఉగ్రవాద దాడుల పట్ల ఎనలేని మద్దతు ఉంది. సమాజంలోని అన్ని వర్గాలనుంచీ దీనికి సమర్థన లభిస్తోంది. అమెరికా వ్యతిరేకత కూడా ఎక్కువే. ఈ నేపథ్యంలో ఒసామా మృతి తరువాత పాకిస్తానీ ప్రజల్లో ఆగ్రహావేశాలు కట్టలు తెంచుకుంటున్నాయి. పాక్ పాలక వర్గాలు దీని గురించే కంగారు పడుతున్నాయి. అందుకే వాళ్లు రకరకాలుగా మాట్లాడుతున్నారు. పాక్ పాలకులు, సైనికాధికారులు చేస్తున్న రెచ్చగొట్టేప్రకటనలు స్థానిక ప్రజలను బుజ్జగించేందుకే. పాక్ విదేశాంగ మంత్రి, అమెరికాలో పాక్ రాయబారి హక్కానీలు మాట్లాడేది అంతర్జాతీయ సముదాయం కోసం. అంటే పాకిస్తాన్ ఇంట ఒక మాట, బయట ఒక మాట చెబుతోందన్న మాట.

ఈ గేమ్ ను భారత దేశం గుర్తించాలి. పాకిస్తాన్ కి ఉగ్రవాదం కూడా ఒక తరహా యుద్ధమేనన్నది మరిచిపోరాదు.

Courtesy : http://rakalokam.blogspot.com/2011/05/blog-post_08.html?spref=fb

0 comments:

Post a Comment