ఒసామా తరువాతి ప్రపంచం ఎలా ఉంటుంది?
Info Post
ఒసామా బిన్ లాడెన్‌ను అమెరికా ఖతం చేసేసింది. 70 వ దశకంలో ఇజ్రాయిలీ విమానాన్ని హైజాక్ చేసి ఉగాండా విమానాశ్రయంలో దాచిన అరబ్ ఉగ్రవాదులను ఇజ్రాయిలీ కమాండోలు ఖతంచేసిన వైనం లాగా, తిరుగులేని ఎల్‌టీటీఈ ఉగ్రవాదపు వెన్నువిరిచిన శ్రీలంక వ్యూహం లాగా, ఒసామాను పట్టిపల్లార్చిన వైనం కూడా ఉగ్రవాదవ్యతిరేక పోరాటయోధులకు పాఠ్యాంశం కాబోతుందనడంలో సందేహం లేదు. ముఖ్యంగా ఒసామాను ఖతం చేయడం వెనుక దశాబ్దకాలం పాటు అమెరికా పడ్డ శ్రమ, చిన్న చిన్న ఆధారాలను కూడా పట్టుకుని వెంటాడుతూ వేటాడుతూ చిట్టచివరికి కమాండో ఆపరేషన్ నిర్వహించడం వంటి అంశాలను రాబోయే రోజుల్లో ప్రపంచదేశాలన్నీ తప్పనిసరిగా అధ్యయనం చేస్తాయి..
అయితే ఒసామా వధతో ముడిపడ్డ ప్రశ్నలు ఇంకా అనేకం ఉన్నాయి. ఒసామాను చంపడం విషయంలో పాకిస్తాన్‌కు నిజంగా ఎలాంటి ప్రమేయమూ లేదా? ఒసామాను చంపిన తరువాత నిజంగానే పాకిస్తాన్ ఇరకాటంలో పడిందా? పాకిస్తాన్ పరువు పోయినా పరవాలేదు...కానీ దాని దౌత్య పరపతి కూడా నిజంగానే పోయిందా? అమెరికా ఇక పాకిస్తాన్ తాట ఒలిచేస్తుందా? ఇక ఇండియా పంట పండినట్టేనా? ఇక భారత్‌లోనూ సరిహద్దుకి అటువైపు నుంచి దిగుమతవుతున్న ఉగ్రవాదపు ఊట ఇంకిపోవడం ఖాయమా? అసలు అంతర్జాతీయ ఉగ్రవాదం ఇక ఎలాంటి రూపం ధరించబోతోంది? అమెరికా, పాకిస్తాన్‌ల భవిష్యత్ వ్యూహాలేమిటి? ఈ ప్రశ్నలన్నీ భారత్ చేస్తున్న ఉగ్రవాద వ్యతిరేక పోరు దృష్ట్యా అత్యంత కీలకమైనవి. ఒక్కో ప్రశ్ననీ పరిశీలిద్దాం....
పాకిస్తాన్ పని అయిపోయినట్టేనా?
ఒక్కసారి ప్రపంచ పటంలోపాకిస్తాన్ ఉండే స్థానాన్ని చూడండి. పశ్చిమాన, ఉత్తరాన అఫ్గనిస్తాన్, ఇటు తూర్పు, దక్షిణాన భారత దేశం. ఈ రెండూ కాకుండా చైనా కూడా పాకిస్తాన్‌ని ఆనుకుని ఉన్నట్టు కనిపిస్తుంది. అంటే పాకిస్తాన్ వాకిలి అఫ్గనిస్తాన్‌లోకి తెరుచుకుంటుంది. పెరటి తలుపు భారత్‌లోకి తెరుచుకుంటుంది. అఫ్గనిస్తాన్ నుంచే ఇస్లామిక్ దేశాల మాలిక మొదలవుతుంది. ఇరాన్, ఇరాక్, అరబ్ దేశాలు, ఉత్తర ఆఫ్రికన్ ముస్లిం దేశాలు, మధ్య ఏషియాలోని మాజీ సోవియట్ దేశాలు ఉబ్జెకిస్తాన్, తాజికిస్తాన్, తుర్క్‌మెనిస్తాన్, అజర్‌బైజాన్, కజకిస్తాన్‌లు వరుసగా ఉన్నాయి. ఈ దేశాలన్నిటిలోనూ అమెరికా వ్యూహాత్మక ప్రయోజనాలను కాపాడేందుకు పాకిస్తాన్ ఒక ఆధారం. ఇటు భారత్‌కు అమెరికా ఎప్పుడు ముకుతాడు వేయాలన్నా పాకిస్తాన్ కావాలి. వ్యూహాత్మక ప్రయోజనాలు కాపాడంలో బహుళార్థక వారధిలా ఉండే దేశాన్ని బ్రిడ్జి స్టేట్ అంటారు. పాకిస్తాన్ అమెరికాకు అలాంటి బ్రిడ్జి స్టేట్. కాబట్టి అమెరికా ఆధిపత్య వ్యూహంలో పాకిస్తాన్ ఒక కీలక పాత్రధారి. అందుకే అమెరికా సైన్యపు సెంట్రల్ కమాండ్ (సెంట్‌కామ్)లో పాకిస్తాన్ ఒక భాగం. ఉగ్రవాద వ్యతిరేక పోరుతో ప్రమేయం లేని అనేక ప్రయోజనాలు పాకిస్తాన్ వల్ల సిద్ధిస్తాయి. కాబట్టి పాకిస్తాన్‌ను అమెరికా ఎట్టిపరిస్థితుల్లోనూ చేజారనీయదు. ఇది భౌగోళిక పరిస్థితులు పాకిస్తాన్‌కి చేకూరుస్తున్న ప్రయోజనం. జాగ్రఫీ మారడం అసంభవం...కాబట్టి పాకిస్తాన్ ప్రాధాన్యం తగ్గడమూ అంతే అసంభవం.
అదే విధంగా పాకిస్తాన్ అధీనంలో ఉన్న ఆక్రమిత కాశ్మీర్‌లోని గిల్గిత్, బాల్టిస్థాన్‌లలోని తోడేలు నాలుక ఆకారంలో ఉండే చిత్రల్ ప్రాంతం నుంచి ఉజ్బెక్, తాజిక్ దేశాలతో పాటు, చైనాలోని ముస్లిం జనాధిక్య షింజాంగ్ ప్రాంతం చేరుకోవడానికి వీలుంది. ఇది కూడా భౌగోళికంగా పాకిస్తాన్‌కి చాలా అనుకూలమైన అంశం.
ఇక మూడో ముఖ్యమైన అంశం. చైనాలోని షింజాంగ్ ప్రాంతం నుంచి, కాశ్మీర్‌లో అంతర్భాగమైనప్పటికీ చైనా అధీనంలో ఉన్న ఆక్సయ్‌చిన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని గిల్గిత్ మీదుగా పాకిస్తాన్లోని అబ్బటాబాద్, ఇస్లామాబాద్‌ల వరకూ కారకోరం హైవే నిర్మాణమై ఉంది. ఇది పాక్, చైనాలను కలుపుతుంది. ఇది కూడా పాకిస్తాన్‌కు భౌగోళికంగా బలిమిని చేకూరుస్తుంది. పాకిస్తాన్ తన భౌగోళిక బలహీనతను బలిమిగా మార్చుకోగలిగింది. కాబట్టి పాకిస్తాన్‌లో ఉగ్రవాదం ఉన్నా, లేకున్నా, పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని పోసించినా, పోషించకున్నా అమెరికాకు మాత్రం ఇది అత్యంత కీలకం. కాబట్టి పాకిస్తాన్ పని అయిపోయిందని భావించడం పొరబాటే అవుతుంది.
ఒసామా వధలో పాక్ ప్రమేయం లేదా?
ఒసామా బిన్ లాడెన్ స్థావరంపై అమెరికన్ సీల్ (Sea, AIr and Land) కమాండోలుమెరుపు దాడి చేయడంలో పాకిస్తాన్ పాత్ర లేనేలేదా? అమెరికన్ ప్రభుత్వం ఇదే మాట చెబుతోంది. పాకిస్తాన్ ప్రభుత్వం కూడా ఛాందస ఇస్లామిక్‌వాదుల వ్యతిరేకతకు భయపడి ఇదే మాట చెబుతోంది. అయితే ఇది నిజంగానే సాధ్యపడే విషయమేనా? అఫ్గనిస్తాన్‌లోని జలాలాబాద్ బేస్ నుంచి మూడు హెలికాప్టర్లు పాక్ భూభాగంలోకి చొచ్చుకువచ్చి, పాకిస్తాన్ నార్తర్న్ కమాండ్ హెడ్‌క్వార్టర్స్ అయిన అబొటాబాద్ కంటోన్మెంట్‌లో ప్రతిష్ఠాత్మక మిలటరీ ఎకాడమీకి కేవలం 500 కి.మీ దూరంలో ఉన్న ఒసామా మూడంతస్తుల స్థావరంపై దాడి చేసి వెళ్లగలుగుతుందా? పాకిస్తాన్ తమ కీలక స్థావరంపై దాడిని అసలు పట్టించుకోదా? అంతకు కొన్ని రోజుల ముందే సరిహద్దు దాటి వచ్చిన డ్రోన్ విమానాన్ని పాక్ సైన్యం కూల్చేసింది. ఈసారి ఎందుకలా జరగలేదు?
అబటాబాద్‌లోని మిలటరీ ఎకాడమీనుంచే పాకిస్తానీ మిలటరీ ఆఫీసర్లు తయారవుతారు. అసలు ఆ నగరంలో కేవలం మిలటరీ ఉద్యోగులు, మాజీ సైనికాధికారులు మాత్రమే ఉంటారు. మొత్తం నగరాన్ని ఒక కంటోన్మెంట్‌గా పరిగణిస్తారు. అక్కడ ఎవరైనా నివసించాలంటే దానికి తప్పనిసరిగా సైన్యం అనుమతి ఉండి తీరాలి. కాబట్టి సైన్యానికి తెలియకుండా ఒసామా అక్కడ అయిదేళ్లుగా ఉండటం అసాధ్యమే కాదు అసంభవం కూడా. చుట్టుపక్కల ఉండే పిల్లల ఆటలో బంతి ఒసామా నివసించిన కంపౌండ్‌లోకి వెళ్తే బంతిని ఇచ్చేవారు కాదు. దానికి బదులుగా 150 రూపాయలు ఇచ్చి కొత్త బంతిని కొనుక్కోమని చెప్పేవారు. పైగా ఇంట్లోని చెత్తను బయట పారేయడానికి బదులు ఇంట్లోనే ఒక మూల కాల్చి బూడిద చేసేవారు. ఇంత పెద్ద ఇంటికి ఫోన్ లేదు, ఇంటర్నెట్ లేదు. అయినా సైన్యానికి, ఐఎస్‌ఐకి అనుమానం రాలేదంటే అంత కన్నా పెద్ద కట్టుకథ ఇంకోటి ఉండదు.
పైగా అక్కడ ఒసామా ఒక్కడే ఉండేవాడు కాదు. ఆయన గారి ఇద్దరు భార్యలు, ఏడుగురు పిల్లలు ఉండేవారు. అంతే కాదు... అబొటాబాద్‌లో అమెరికా దాడి జరిగిన మరుక్షణం అక్కడ విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. ఈ విషయాన్ని ట్విట్టర్‌లో సొహైబ్ అథర్ పంపిన ట్వీట్‌లు కూడా ధ్రువీకరించాయి. దాడి జరగగానే అబొటాబాద్‌ను పాక్ సైన్యం దిగ్బంధనం చేసేసింది. ఎవరినీ బయటకు వెళ్లనీయలేదు. ఈ దాడిని ఎవరూ సెల్‌ఫోన్లలో బంధించకుండా జాగ్రత్త పడింది. దీని కోసం ఇంటింటికీ వెళ్లి జవాన్లు సిమ్ కార్డులను కూడా సేకరించారని పాక్ పత్రికల్లో కథనాలు వచ్చాయి. లాడెన్ ఇంటికి దగ్గర్లో ఉండే షమీజ్ ఖాన్ అనే ఒక 50 ఏళ్ల రైతును పాక్ పోలీసులు ఓసామా చనిపోయిన కొంత సేపటికే అరెస్టు చేశారు. ఆయన ఇంట్లోకి తొంగి చూసేందుకు ప్రయత్నిస్తుండగా అరెస్టు చేశారు. ఇవన్నీ అమెరికా దాడి విషయంలో పాక్ సైన్యానికి ముందే తెలుసునన్న అనుమానాలకు బలం చేకూరుస్తున్నాయి.
ఏమీ వినకు...ఏమీ చూడకు...ఏమీ చేయకు.....
ఇండియన్ ఆర్మీ మాజీ చీఫ్ శంకర్ రాయ్ చౌధురీ కూడా "సూపర్ సెన్సిటివ్ ఏరియాలో హెలికాప్టర్ ఆపరేషన్లు జరిగి, 40 నిమిషాల పాటు కాల్పులు జరిగితే సైన్యం ఎందుకు మౌనంగా ఉంది? సైన్యానికి ఏమీ చూడకు, ఏమీ వినకు, ఏమీ చేయకు అని ఏవైనా ఆదేశాలు వచ్చాయా?" అన్న ప్రశ్న వేయడం గమనార్హం. అమెరికాలోని చట్టసభల సభ్యులు కొందరు పాకిస్తాన్‌కు ఆర్ధిక సహకారం ఆపేయాలని డిమాండ్ చేసినా, అమెరికన్ విదేశాంగ శాఖ మాత్రం పాకిస్తాన్‌తో సంబంధాలు యథాతథంగా కొనసాగుతాయని, పాకిస్తాన్‌కు చేస్తున్న ఆర్ధిక సాయంలో ఎలాంటి కోత ఉండబోదని స్పష్టం చేసింది. దీన్నెలా అర్థం చేసుకోవాలి?
పాకిస్తాన్‌కు ఉగ్రవాదం ఒక బార్గెయినింగ్ చిప్ లాంటిది. దాని ఆధారంగా అది అమెరికాతో బేరసారాలు చేసుకుంటుంది. బ్లాక్‌మెయిల్ చేస్తుంది. సహాయాలు పొందుతుంది. ఐఎస్‌ఐ గతంలో అఫ్గన్ సరిహద్దుల్లో పనిచేసే ఉగ్రవాద హక్కానీ నెట్‌వర్క్‌ను ఒక వ్యూహాత్మక సంపదగా అభివర్ణించింది. అదే విధంగా ఒసామాను మించిన వ్యూహాత్మక సంపద పాకిస్తాన్‌కు ఇంకేం ఉంటుంది? తన వ్యూహాత్మక ప్రయోజనాలు కాపాడుకునేందుకు పాకిస్తాన్ ఒసామాను పణంగా పెట్టి ఉండొచ్చు కదా?
ఈ అనుమానానికి బలం చేకూర్చే సంఘటనలు కొన్ని జరిగాయి. అవి పెద్దగా పత్రికలకు ఎక్కలేదు. ఏప్రిల్ 11న ఐఎస్‌ఐ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షూజా పాషా సీఐఏ చీఫ్ లియోన్ పానెట్టాను వాషింగ్టన్‌లో కలుసుకున్నారు. షూజాపాషా ప్రస్తుత పాక్ సేనాధ్యక్షుడు పర్వేజ్ అష్పక్ కయానీకి అత్యంత సన్నిహితుడు. నిజానికి కయానీ కూడా గతంలో ఐఎస్ఐ చీఫ్‌గా పనిచేశారు. ఇద్దరికీ ఈ మధ్యే రెండు మూడేళ్ల పాటూ పదవిలో పునర్నియుక్తి జరిగింది. వీరిద్దరికీ ఎక్స్‌టెన్షన్ లభించడంలోనూ అమెరికాది కీలక పాత్ర. కయానీ కూడా ఈ మధ్యే అమెరికాలో పర్యటించి వచ్చాడు. ఇక పానెట్టా త్వరలోనే
ఏప్రిల్ 11న వాషింగ్టన్‌లో జరిగిన చర్చల్లో ఏం జరిగిందో మామూలుగానైతే బయటకు తెలియకూడదు. కానీ ఐఎస్‌ఐ స్వయంగా ఈ సమావేశ వివరాలను లీక్ చేసింది. ఈ సమావేశంలో అఫ్గనిస్తాన్‌నుంచి అమెరికా వైదొలిగిన తరువాత అఫ్గన్ వ్యవహారాల పూర్తి బాధ్యత పాకిస్తాన్‌కే లభిస్తుంది. అంటే పాకిస్తాన్‌లోని ఐఎస్‌ఐ, సైన్యం, అఫ్గనిస్తాన్‌లోని తాలిబాన్ల సాయంతో కలిసి అఫ్గనిస్తాన్ భవితవ్యాన్ని నిర్ణయిస్తుంది. రెండవది అమెరికా తన మానవ రహిత డ్రోన్ విమాన దాడులను నిలిపివేస్తుంది. మూడవది...పాకిస్తాన్‌లో పనిచేస్తున్న సీఐఏ ఏజెంట్ల సంఖ్యను 40 శాతం తగ్గించడం జరుగుతుంది. అమెరికానుంచి ఇన్ని గ్యారంటీలు పొందిన తరువాత తన రక్షణలో అయిదేళ్లుగా ఉన్న లాడెన్‌ను బలిపెట్టేసిందని అనుమానించడానికి బలమైన ఆధారాలు కనిపిస్తున్నాయి.
పాక్ సైన్యంపై అమెరికా పట్టు...
పర్వేజ్ అష్రఫ్ కయానీ, షూజాపాషాలను అమెరికా గత పలు సంవత్సరాలుగా కల్టివేట్ చేస్తూ వస్తోంది. వారు పలు సార్లు అమెరికాలో పర్యటించారు. అమెరికన్ సైన్యాధికారులు కూడా పాకిస్తాన్ వచ్చి, వారిని కలుసుకుంటూనే ఉన్నారు. పాకిస్తాన్‌లో నిజమైన అధికార కేంద్రం సైన్యమే కాబట్టి సైన్యాన్ని తన కనుసన్నలలో ఉంచుకునేందుకు అమెరికా ప్రయత్నిస్తోంది. సైన్యంలోని జెహాదీ శక్తులపై పట్టు సాధించేందుకు గానూ కయానీ, పాషాలను బలోపేతం చేస్తూ వస్తోంది. కాబట్టి రాబోయే రోజుల్లో అమెరికా, పాకిస్తాన్ల సంబంధాలు మరింత గట్టిపడటం ఖాయం. అఫ్గనిస్తాన్‌లో భారత ప్రాబల్యం అంతరించిపోయే పరిస్థితి రావచ్చు. గత కొద్ది కాలంగా అఫ్గన్ అధ్యక్షుడు హమీద్ కర్జాయ్ తన చిరకాల శత్రువు పాకిస్తాన్‌ను మచ్చిక చేసుకునేందుకు ప్రయత్నించడానికీ ఇదే కారణం. దీని వల్ల అఫ్గనిస్తాన్‌లో 650 బిలియన్ల డాలర్ల విలువైన భారత పెట్టుబడులు, వాణిజ్య ప్రయోజనాలు ప్రభావితం కావచ్చు.
వీటన్నిటి కన్నా పెద్ద సమస్య ఇంకొకటుంది. పశ్చిమ దిక్కున పూర్తి పట్టు లభించాక పాకిస్తాన్ తన దృష్టిని పూర్తిగా తూర్పువైపు...అంటే భారత సరిహద్దులపై కేంద్రీకరించే సూచనలున్నాయి. ఇప్పటికే పర్వేజ్ కయానీ భారతదేశం అమెరికా లాగా ఆపరేషన్ జెరోనిమో వంటి చర్యలు చేపడితే దెబ్బకు దెబ్బతీస్తామని హెచ్చరించారు. మరో వైపు పాక్ ప్రభుత్వం గురువారం నాడే 26/11 నిందితులను అప్పగించాలన్న భారత డిమాండ్ కాలబాహ్యమైనదని కొట్టిపారేసింది. కాబట్టి ఒసామా వధతో పాక్ బలపడిందే తప్ప బలహీనపడలేదు. భారత బలహీనపడిందే తప్ప బలపడలేదు.
Courtesy : http://rakalokam.blogspot.com/2011/05/blog-post.html
0 comments:
Post a Comment